సరదాగా మొదలుపెడితే భూతమై కమ్ముకుంటుంది

సరదాగా మొదలుపెడితే భూతమై కమ్ముకుంటుంది. ఒక్కసారి రుచి చూద్దామనుకుంటే ఇక వందలసార్లు దాని ప్రభావానికి బలవ్వాల్సిందే. సరదా అలవాటు మానలేని పెనువ్యసనమై ప్రాణాలకే ముప్పు తెస్తుంది. సాధారణంగా ఒక్కో రకమైన అవయవానికి ఒక్కో కారణం వల్ల జబ్బు వస్తుంది. కానీ అన్ని శరీర అవయవాలనూ ఒక్కసారే జబ్బుకు గురిచేసే అలవాటది. అదే పొగాకు. సరదా సరదాగా మొదలెట్టే సిగరెట్. ఒక్క దమ్ము లాగితే స్వర్గలోకాన్నే కాదు.. జబ్బుల వలయాన్ని కూడా ముందుకు తెస్తుంది. పీల్చే సిగరెట్టయినా, నోట్లో వేసుకునే గుట్కా అయినా.. రూపమేదైనా సరే సుమారు నాలుగు వేల రకాల మృత్యుపాశాలను పంపే పొగాకుకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉన్నట్టే.

పొగాకులో పొగ మాత్రమే కాదు. ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్, కార్సినోజెన్స్ వంటి అనేక పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ ఆరోగ్యం మీద నేరుగా శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇవే పొగతో సంభవించే వ్యాధులకు కారణం. పొగ ప్రభావం శరీరంలోని ప్రతీ అవయవం మీద ఉంటుంది.

కళ్లు, ముక్కు, గొంతు

పొగతాగడం వల్ల శరీరం మీద పడే ప్రభావాలు కళ్లు, ముక్కు, గొంతు మీద కనిపిస్తాయి. మొదటి దమ్ము పీల్చుకున్న కొద్ది సెకన్లలోపునే, హానికరమైన వాయువులు కళ్లు, ముక్కు, గొంతు లాంటి సున్నితమైన పొరల మీద ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, గొంతు నొప్పిగా ఉంటుంది. అయినా పొగ తాగడం కొనసాగిస్తే పొగలోని విష వాయువుల వల్ల కఫం ఏర్పడుతుంది. నిరంతరం పొగతాగడంతో, గొంతులోని పొర అనూహ్యమైన విధంగా మందంగా తయారవుతుంది. దీని మూలంగా గొంతు క్యాన్సర్‌లో కనిపించే కణాల మార్పు కనిపిస్తుంది.

ఊపిరితిత్తులు

పొగతాగడం వల్ల సహజంగా ఊపిరితిత్తుల పని సామర్థ్యం తగ్గిపోతుంది. శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గి శ్వాసల సంఖ్య పెరుగుతుంది. అందువల్ల ఊపిరితిత్తులు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. పొగలో ఉండే విషరసాయనాల మూలంగా ఊపిరితిత్తుల కణాలకు హాని జరుగుతుంది. దీని వల్ల శ్లేష్మం ఉత్పత్తి పెరిగి దగ్గు ఎక్కువవుతుంది.

శ్లేష్మం పెరగడం వల్ల శరీరం సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువుగా మారుతుంది. తద్వారా చలిజ్వరం, ఫ్లూ, బ్రాంకైటిస్, ఇతర శ్వాస సంబంధిత అంటువ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని రక్షణ వ్యవస్థ బలహీన పడుతుంది. శ్వాసనాళ గోడలు మందంగా మారి క్యాన్సర్‌కు దారితీయవచ్చు. చాలా వరకు ఊపిరితిత్తులలో క్యాన్సర్లు ఈ కారణంగా ఏర్పడుతాయి. సీఓపీడి బారిన పడవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఏర్పడే ఈ ఇబ్బందికి ఒకే ఒక కారణం పొగతాగడం. సీఓపీడి వల్ల మరణించే వారిలో 81.5 శాతం పొగతాగేవారే. ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోనియా వంటి ప్రమాదకర శ్వాసకోశ అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గుండె

అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో హృద్రోగ మరణాలు చాలా ఎక్కువ. పొగతాగడం గుండెపోటు రావడానికి బలమైన కారణాలలో ఒకటి. పొగ ఊపిరితిత్తులకు చేరగానే గుండెకు శ్రమ పెరుగుతుంది. నిమిషానికి 10 నుంచి 25 స్పందనలు ఎక్కువగా చెయ్యాల్సి ఉంటుంది. పొగాకు పొగలో ఉండే నికోకొటిన్, ఇతర హాని కారక రసాయనాల మూలంగా హృదయ స్పందన క్రమరహితమవుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు.

రక్తనాళాలు

పొగతాగడం వల్ల రక్తపోటు మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. పొగతాగిన ప్రతిసారి 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. అందువల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి గుండెపోటు, పక్షవాత ప్రమాదం పెరుగుతుంది. పెరీఫెరల్ వాస్కులార్ వ్యాధి రావడానికి పొగతాగడం అనేది అత్యంత ముఖ్యమైన కారణం.

రక్తం

కార్బన్ మోనాక్సైడ్ వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాలలో ఒకటి. అయితే ఇది అంతకు 600 రెట్లు ఎక్కువ గాఢతతో పొగాకు పొగలో ఉంటుంది. పొగతాగని వారితో పోల్చినపుడు, పొగతాగేవారి రక్తంలోనాలుగు నుంచి పదిహేను రెట్లు ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉంటుంది. పొగతాగిన కొన్ని గంటల వరకు రక్తంలో ఉంటుంది. పొగపీల్చిన కొన్ని సెకన్లలోనే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో చేరుతుంది. ఇది ఎర్రరక్త కణాల నుంచి ఆక్సిజన్ కణాలను తొలగిస్తుంది. అందువల్ల మెదడు, ఇతర కణాజాలాలకు తక్కువ ఆక్సీజన్ వెళ్తుంది. కార్బన్ మోనాక్సైడ్ భారం ఎక్కువ. అందువల్ల కార్బన్‌డయాక్సైడ్ తొలగించడంలో ఊపిరితిత్తులు విఫలమవుతుంటాయి. దీర్ఘకాలంగా పొగతాగే వారిలో ఎర్రరక్త కణాల స్థాయి అనూహ్యంగా పెరిగిపోయి ఉంటుంది. అలాగే కొనసాగిస్తే రక్తం సులభంగా గడ్డకడుతుంది. ఆ రెండు అంశాల మూలంగా గుండె పోటు, పక్షవాత ప్రమాద స్థాయి పెరుగుతుంది.

చర్మం

పొగతాగడం వల్ల మీ చర్మంలోని రక్తనాళాలు బిగుసుకుపోతాయి. ఆ విధంగా శరీరంలోని అతి పెద్ద అవయవానికి ప్రాణాన్ని సమకూర్చే ఆక్సీజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనికి తోడుగా హానికారక సూర్యకిరణాలు వయసుకు ముందే ముడతలు పడేలా చేస్తాయి.

క్యాన్సర్

పొగతాగడానికి క్యాన్సర్‌కి మధ్యలో విడదీయరాని సంబంధమున్నట్టు రుజువులు ఉన్నాయి. సిగరెట్ తాగడంలో కనీసం 43 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. వీటి వల్ల మెడ, స్వరపేటిక, మూత్రాశయ, మూత్రపిండాలు, జీర్ణాశయం, క్లోమము క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ.

పెప్టిక్ అల్సర్

పొగతాగడం వల్ల పెప్టిక్ అల్సర్ ఏర్పడడం, అది త్వరగా నయం కాకపోవడం, నయమైనా తిరిగి ఏర్పడడం చికిత్సకు స్పందించకపోవడం జరగవచ్చు. అంతేకాదు యముకలు కూడా పొగతాగడం వల్ల గుల్లబారి విరిగిపోవచ్చు. పొగతాగడం వల్ల తాగేవారికి ప్రాణాంతకం మాత్రమే కాదు. పరిసరాలలో ఉన్న వారు అసౌకర్యానికి గురవటమే కాకుండా వారి ఆరోగ్యానికి కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఈ నోటోబాకో డే సందర్భంగా పొగతాగే వారిలో కొంత మందైనా పొగమానాలన్న నిర్ణయం తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్యం, డబ్బు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉండే వారిని కూడా కాపాడిన వారవుతారు.

మృత్యుదారి.. పొగాకు...!

దేశవ్యాప్తంగా మేజర్లయినవారిలో మూడొంతుల మంది ఏదో ఒక రూపంలో పొగాకును తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో టీనేజీ పిల్లల్లో కూడా ఈ అలవాటు కనిపిస్తోంది. సరదాకో, ఒక్కసారి ట్రై చేద్దామనో మొదలుపెడతారు. ఇక దాని నుంచి బయటపడలేకపోతారు. ఈ సంవత్సరం జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైన విషయం షాకింగ్‌గా ఉంది. మనదేశంలో పొగాకు మొదలుపెడుతున్నవారి వయసు సగటున 17 సంవత్సరాలు. అంతకన్నా చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్లను చూసి సిగరెట్ తాగుతున్నారు. అదేదో గొప్ప అలవాటు, నాగరికత అన్న అభిప్రాయాలు ఉండడమే దీనికి కారణం. దాదాపు నాలుగు లక్షల క్యాన్సర్ కేసులు పొగాకు వినియోగం వల్ల కలుగుతున్నవే. అంటే క్యాన్సర్లు పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం పొగాకే అన్న విషయం గ్రహించాలి.

ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఏ పాపం తెలియనివాళ్లు, పొగతాగే అలవాటు కాదు కదా.. పొగ అంటే పడనివాళ్లు సైతం పొగాకు దుష్ప్రభావాలకు గురవడం. ఇతరులు పీల్చి వదిలిన పొగ వల్ల కూడా అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నవాళ్లు పెరుగుతున్నారు. కొంతమంది ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి సిగరెట్ తాగుతున్నాను కదా.. ఇక ప్రాబ్లం ఏంటనుకుంటారు. కానీ సిగరెట్ తాగుతున్నప్పుడే కాదు.. అది పూర్తయిన తరువాత కూడా చాలాసేపు వదిలిన పొగలోని రసాయనాలు ఆ ప్రాంతంలో ఉంటాయి.

కాబట్టి ఆ తరువాత అక్కడికి వచ్చినవాళ్ల పైన కూడా వాటి ప్రభావం ఉంటుంది. ఇంట్లో ఉండేవారిలో 52 శాతం, ఉద్యోగరీత్యా బయటకు వచ్చేవారిలో 30 శాతం మంది ఈ ప్యాసివ్ స్మోకింగ్ బారిన పడుతున్నారు. 80 నుంచి 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు పొగతాగడం వల్లనే వస్తున్నాయి. పొగతాగేవాళ్లు ఆ అలవాటు లేనివాళ్లకన్నా ఏడున్నరేళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతారు.

ప్రపంచవ్యాప్తంగా పొగాకు అలవాటు వల్ల మృత్యుముఖం పడుతున్నవారు 3.5 నుంచి 4 మిలియన్ల మంది ఉన్నారంటే ఇది ఎంత పెద్ద భూతమో అర్థం చేసుకోవచ్చు.



 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review