డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజు


 ఆరోగ్యం పాడయ్యాకా రోగాలు వస్తాయా? లేదా రోగాలు వచ్చాక మన ఆరోగ్యం పాడవుతుందా? ఆలోచించండి. అందరూ చెప్పే సమాధానం ఏమిటంటే, నాకు అనారోగ్యం వచ్చాకే ఆరోగ్యం పోయింది అని. కానీ ఇది తప్పు. ఆ రోగం రాక ముందు నేను బాగానే ఉన్నాను. ఆ రోగం వచ్చిన దగ్గర్నుండీ నా బతుకు ఇలా అయ్యింది. అప్పటినుంచి నా ఆరోగ్యం పూర్తిగా పోయింది అని అంటూ ఉంటారు. 

వాస్తవంగా, మనలో ఆరోగ్యం అనే వెలుగున్నంత కాలం రోగం ప్రవేశించదు. ఆరోగ్యం మనలో తగ్గుతున్నప్పుడు రోగం ప్రవేశిస్తూ ఉంటుంది. రోగం మనలో బీజం వేసుకున్నపుడు, ఆ బీజం మెల్లగా మొక్కగా ఎదుగుతున్నపుడు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామే అనుకుంటాం. మనకు అప్పటికి ఏ లక్షణాలు రావు. ఆ రోగ లక్షణాలు క్రమంగా పెరుగుతున్నపుడు మెల్లగా మనకు సమస్యలు కొద్దికొద్దిగా తెలుస్తూ ఉంటాయి. అప్పుడు పరీక్షలు చేయిస్తే ఒక్కోసారి రోగంగా అది దొరకవచ్చు లేదా ఇంకా ముదరక పరీక్షలో ఏమీ లేదని రావచ్చు. ఏమీ లేదని రిపోర్టు వస్తే అప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామనే అనుకుంటూ ఉంటాం. కొన్ని రోజులకు ఆ రోగం ముదిరి, పూర్తిగా దాని లక్షణాలన్నీ బయటకు కనిపించి మనల్ని సాంతం మూలపడేస్తుంది. అప్పుడు పరీక్షల్లో ఫలానా రోగం అని తేలుతుంది. మనం హాస్పిటల్‌లో ఉన్నపుడు మాత్రం నాకు అనారోగ్యంగా ఉందని అంటాం. ఇప్పుడు చెప్పండి. అనారోగ్యం వచ్చి ఆరోగ్యం పోయిందా? లేదా ఆరోగ్యం పోయి అనారోగ్యం వచ్చిందా? గింజల్లో పురుగు పట్టాక రోగనిరోధకశక్తి (వెలుగు) ఇంతకాలం ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి కారణమై నిలిచి ఉందో, ఆ శక్తి క్షీణించిన దగ్గర్నుండీ పురుగుపట్టి అందులో చేరే అవకాశం కలిగింది. అలాగే మనలో కూడా ఆరోగ్యమనేది పోయినపుడే ఏ రోగమైనా మనలో ప్రవేశించేది! మనలో ఆరోగ్యం నశించడానికి కారణాలు ఏమిటి? మనకు ఆరోగ్యం చెడిపోవడానికి పరిసరాలు, నీరు, గాలి, అపరిశుభ్రత మొదలగునవి కారణాలా? ఎక్కువ మంది ఇవి ఎక్కువ కారణాలని చెబుతారు. కానీ ఇవి 10 శాతం కారణమైతే, 90 శాతం మనలో రోగనిరోధకశక్తి (ఆరోగ్యశక్తి) నశించడమే కారణం. 

మన శరీరం బలంగా ఉన్నపుడు, ఆ చె డును లోపలకు రాకుండా కాపాడుకోగలదు. ఒకవేళ వాటినుంచి ఏమైనా క్రిములు మనలో ప్రవేశించి, బతికి పోషించబడుతున్నాయంటే, మనలో శక్తి నశించడమే కారణం. మన చేతిలో ఉండే బారెడు శరీరాన్ని మనం లోపల పరిశుభ్రంగా ఉంచుకోలేక, అందులో ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుకోలేక, మొత్తం తన చుట్టూ ఉన్న ప్రపంచమే మారాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. తల్లిదండ్రుల వారసత్వంగా మనకు ఆరోగ్యం చెడిపోయిందా? అలా అనుకోవడానికీ లేదు. మనం ఆర్యోగం చెడగొట్టుకునే గదా డాక్టర్ల దగ్గరకు వెళ్లేది. అనారోగ్యం తగ్గడం, తగ్గకపోవడం అనేది మన శరీర స్థితిని బట్టి ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇంకా కారణాలు చూస్తే, మానసికమైన ఒత్తిళ్ల వల్ల ఆరోగ్యం పోతున్నదా, అంటే అది కొంత కారణమే గానీ పూర్తిగా అదీ కాదు. మరి అసలు కారణం ఎక్కడా ఉండకుండా ఎలా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని పాడుచేసే అసలు దొంగ ఎవరు? ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టకోలేడన్నట్లు గానే, మనకు రోగాలు రావడానికి, హాస్పిటల్స్‌ పాలు కావడానికి, బాధలనను భవించడానికీ కారకులం మనమే. ప్రతిరోజూ మన ఆరోగ్యాన్ని మనం కొంచెం కొంచెం పాడు చేసుకుంటూ చివరకు ఈ స్థితికి వచ్చాం. అందుకే, వాడి ఆరోగ్యాన్ని వాడు చేజేతులారా పాడు చేసుకున్నాడండీ, ఆ ఖర్మ ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాడు చూడండి. చేసింది అనుభవించక తప్పుతుందా? ఇలా మన పెద్దవారంటూ ఉంటారు. 


మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని పూర్వీకులు గ్రహించారు కాబట్టే ఆరోగ్యంగా బతకగలిగారు. ఈ రోజుల్లో ప్రజలకు, ముఖ్యంగా చదువుకున్న వారికి, డబ్బులున్న వారికి మాత్రం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని అసలు తెలియడం లేదు. అందుకే ఆరోగ్యం ఇంత బాగా చెడిపోయింది. లేచిన దగ్గర్నుండీ పడుకునే వరకూ కొంత టైమన్నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారా? అన్నింటికీ టైము పెట్టి మరీ శ్రద్ధగా చేసుకుంటారు. చదువుకోవడం, సంపాదించుకోవడం, హాయిగా తినడం, హాయిగా తిరగడం, జీవితాన్ని జల్సాగా గడిపివేయడం అందరికీ చేతనవుతున్నది. కానీ ఆరోగ్యంగా బతకడానికే టైం లేదు. ఆరోగ్యంగా బతకాలనే కోరికా లేదు. ఇక ఆరోగ్యం ఎలా వస్తుంది? మన ఆరోగ్యం గురించి ఏ రోజైనా మంచిగా నమిలి తినడానికి టైము పెట్టుకొని, మలమూత్రాదులను పోసుకోవడానికి టైం పెట్టుకొని, వ్యాయామం, ధ్యానం చేయడానికి టైం ఉంచుకొని, పెందలకడనే తినడానికి టైం పెట్టుకొని, పెందలకడనే పడుకోవడానికి టైం పెట్టుకొని, శరీరంపై శ్రద్ధ పెట్టి మనం ఆరోగ్యం కోసం ప్రయత్నించింది ఏమైనా ఉందా? మనం ఇన్ని విధాలుగా అశ్రద్ధ చేస్తూ ఉంటే తల్లిదండ్రుల నుంచి మనకు లభించిన ఆరోగ్యం అలానే జీవితాంతం ఎలా ఉంటుంది? మనం ఏ విధంగా శరీరానికి సహకరిస్తున్నామని, శరీరం మనకు ఆరోగ్యాన్నిచ్చి సహకరిస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడం మర్యాద. 

మన విషయంలో ఆరోగ్యం పోవడానికి కారణం, మనం శరీరానికి ఇవ్వడమనేది లేకుండా ఏకంగా అంతా తీసుకోవడమే అవుతుంది. అందుకే ఆరోగ్యం పూర్తిగా రోజురోజుకీ నశించి పోతున్నది. మన చేతుల్లో ఉన్నఆరోగ్యాన్ని మనమే తిరిగి బాగుచేసుకోవడానికి ప్రయత్నించడం ఒక్కటే సరైన మార్గం. అందుచేతనే ‘‘మీ ఆరోగ్యం మీ చేతుల్లో’’ ఉందనే సత్యాన్ని గ్రహించండి. చేతిలో ఉన్న మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఆరోగ్యవంతుని లక్షణం. ప్రయత్నించండి..!

ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ 9848021122కు కాల్‌ చేయవచ్చు.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review