ఎంత తక్కువగా తిన్నా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గదు. గంటకు రెండునిమిషాలైనా లేచి అటు ఇటు తిరగాలి. ఆ తర్వాత ఈ ఆసనం వేస్తే పొట్ట తగ్గడం మీరే గమనిస్తారు. ఈ ఆసనం ట్రై చేస్తారు కదూ..
పాశు విశ్రమాసనం
ముందుగా రెండు కాళ్లు చాపి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలిని బయట వైపునకు మడిచి ఎడమ కాలి పాదం కుడికాలి తొడ భాగానికి ఆనేటట్టు ఉంచాలి. గాలి పీల్చుకుంటూ రెండు చేతులను పైకి చాచాలి. గాలి వదిలేస్తూ రెండు చేతులతో పాటు తలను ఎడమకాలి మోకాలి ముందర నేలపై ఆనేట్టు వంచాలి. చేతులు తలపై కాకుండా పక్కకు వచ్చేట్టుగా చూడాలి. ఇలా 5 నుంచి 15సార్లు చేయాలి. తర్వాత కాళ్లు అదేవిధంగా ఉంచి గాలివదిలేస్తూ చేతులు, తలను వంచాలి. ఇలాకూడా కనీసం పదిహేను సార్లు చేయాలి. ఇప్పుడు ఎడమకాలిని బయటవైపునకు మడిచి, కుడిపాదం ఎడమ కాలి తొడ భాగంలో ఆనేట్టు ఉంచాలి. పైన చెప్పిన విధంగానే కుడి వైపునకు, ఎడమ వైపునకు వంగాలి. ఇలా 5 నుంచి 15సార్లు రిపీట్ చేసి యథాస్థితికి చేరుకోవాలి.
ఉపయోగాలు :
- నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది.
- పొట్ట తగ్గడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది.
- ఎప్పుడూ కూర్చొని పని చేసే వాళ్ళకి చాలా మంచిది.
గమనిక:
- ముందుగా తల మొత్తం భూమి మీద ఆనకున్నా వీలైనంత వరకే చేయాలి. పొట్ట తగ్గుతున్నా కొద్దీ నుదుటి భాగం నేలకు ఆనుతుంది.


